: భావితరం చేసే పనులేనా ఇవి? భావోద్వేగ ప్రసంగంతో విపక్షాలను ఏకేసిన స్మృతీ ఇరానీ!


హైదరాబాద్ లో రోహిత్ వేముల ఆత్మహత్యకు ముందు జరిగిన ఘటనలు, న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీలో నెలకొన్న పరిస్థితులతో పాటు బెంగాల్, చత్తీస్ గఢ్, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలు వివరిస్తూ, కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతీ ఇరానీ చేసిన భావోద్వేగ ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. "నా పేరు స్మృతీ ఇరానీ. నా కులమేంటని ఎవరైనా అడగగలరా?" అంటూ విపక్ష సభ్యులను చాలెంజ్ చేసిన ఆమె, రోహిత్ దళితుడు కాబట్టే సస్పెండ్ చేశారని చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో తనను ఎవరూ వేలెత్తి చూపలేరని, తన తప్పు లేని చోట క్షమాపణలు చెప్పే పరిస్థితే లేదని అన్నారు. దాదాపు 50 నిమిషాల పాటు మాట్లాడిన ఆమె, వర్శిటీల్లో విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ నుంచి జాతి వ్యతిరేఖ వ్యాఖ్యలు చేస్తున్న ఉదంతాల వరకూ ఎన్నో అంశాలను ప్రస్తావించారు. భావి భారతావనికి అండగా నిలవాల్సిన విద్యార్థిలోకం, ఈ తరహా దురదృష్టకర ఘటనల్లో భాగం పంచుకోవడం తగదని సలహా ఇచ్చారు. తాను రాహుల్ సొంత నియోజకవర్గం అమేధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నందునే, మరోసారి అక్కడ గెలవబోమన్న భయంతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థినీ విద్యార్థులంతా తన కొడుకు, కూతుళ్లేనని వ్యాఖ్యానించిన ఆమె, వారిని ఓటు బ్యాంకులుగా చూడవద్దని హితవు పలికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న వేళ, ఢిల్లీ దాటి కాలు కూడా బయటపెట్టని రాహుల్, హెచ్సీయూ ఘటన తరువాత పలుమార్లు హైదరాబాద్ వెళ్లి రాజకీయాలు చేసి వచ్చారని విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News