: ఆసియా కప్ లో భారత్ శుభారంభం ... బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా
టీమిండియా బోణీ కొట్టింది. నిన్న రాత్రి బంగ్లాదేశ్ లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఆసియా కప్ తొలి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను భారత్ చిత్తు చేసింది. 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి తన సత్తా మరోసారి చాటి, శుభారంభాన్ని ఇచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగుకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విజృంభించి 55 బంతుల్లో 83 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 31 పరుగులు చేసి స్కోరు పెంచాడు. అనంతరం 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా క్రికెటర్లు ఇరవై ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 121 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. దీంతో ఇండియా 45 పరుగుల తేడాతో తొలి మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.