: తెలంగాణలో మే 2న ఎంసెట్ పరీక్ష... మే 12న ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షను మే 2న నిర్వహించనున్నారు. ఎంసెట్ నోటిఫికేషన్ రేపు విడుదల కానుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 28 నుంచి మార్చ్ 28 వరకు ఆన్ లైన్లో ఎంసెట్ కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆపై ఏప్రిల్ 3 వరకు రూ.500 అపరాధ రుసుముతో, 13 వరకు రూ.1000 అపరాధ రుసుముతో, రూ.5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3 నుంచి అదే నెల 13 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారు. ఇక ఏప్రిల్ 24 నుంచి 30 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం వుంటుంది. ఇక పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.250, ఇతరులకు రూ.500లుగా నిర్ణయించారు. మే 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష నిర్వహిస్తారు. తొలిసారిగా ఓఎంఆర్ కాపీని విద్యార్థులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మే 3న ఎంసెట్ ప్రాథమిక 'కీ' విడుదలవుతుంది. ప్రిలిమనరీ 'కీ'కి సంబంధించి మే 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 12న ఎంసెట్ ఫలితాలను వెల్లడించనున్నారు.