: కేకర్కో బుట్టా అడవుల్లో విమాన శకలాలు... గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు!
ఈ ఉదయం 8 గంటల సమయంలో రాడార్లకు కనిపించకుండా మాయమై, కుప్పకూలిన తారా ఎయిర్ పాసింజర్ విమాన శకలాలున్న ప్రాంతానికి సైన్యం చేరుకుంది. ఈ విషయాన్ని నేపాల్ విమానయాన శాఖా మంత్రి ఆనంద ప్రసాద్ పోఖ్రేల్ స్పష్టం చేశారు. మ్యాగ్దీ జిల్లా పరిధిలోని కేకర్కో బుట్టా అడవుల్లో విమానం కుప్పకూలి దగ్ధమైందని తెలిపారు. విమానం రెక్కలు, తోక భాగాలు కనిపించాయని, బ్లాక్ బాక్స్ కోసం వెతుకులాట ప్రారంభించామని తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినట్టు తెలుస్తోంది. విమానం గాల్లోనే మండుతూ కుప్పకూలినట్టు కూడా కొందరు చెబుతున్నారు.