: సుస్థిర ప్రభుత్వాన్ని పడగొడతాననడం జగన్ అవివేకం: పయ్యావుల
ఏపీ రాజకీయాల్లో జగన్ భస్మాసురుడి పాత్ర నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. ఇవాళ ఆయనకు ఆయనే శత్రువు అనడానికి వైసీపీ సభ్యులు టీడీపీలో చేరడమే సూచనని చెప్పారు. వైసీపీ బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరిన సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్న సుస్థిర ప్రభుత్వాన్ని పడగొడతాననడం జగన్ అవివేకమని మండిపడ్డారు. ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరిలో ఓ ఆలోచన కలగజేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు సైతం బాబు నాయకత్వాన్ని బలపరచాలనే పార్టీలో చేరుతున్నారని పయ్యావుల పేర్కొన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారడంపై జగన్ ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతున్నారని, కానీ ఒక్కసారి చరిత్రలోకి వెళితే 2004లో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది వైఎస్ కాదా? అని పయ్యావుల ప్రశ్నించారు. ఆనాడు ఇలా ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి రాజమార్గం వేసింది ఆయనే కదా? అని చెప్పుకొచ్చారు. మరప్పుడు ఎంపీ అయిన జగన్ కు ఈ విషయం గుర్తులేదా? అని పయ్యావుల నిలదీశారు. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల గురించి జగన్ మాట్లాడడం లేదన్నారు.