: రూ.450 చేతబట్టుకుని జైలు బయటకు రానున్న 'ఖల్ నాయక్'
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తన శిక్షా కాలాన్ని ముగించుకుని రేపు జైలు నుంచి విడుదల కానున్నాడు. కేసు విచారణలో ఉండగానే చాలా కాలం పాటు జైల్లోనే ఉన్న సంజయ్ దత్... శిక్ష ఖరారైన తర్వాత ఎరవాడ జైలులో మిగిలిన శిక్ష అనుభవించాడు. విచారణ ఖైదీగా అతడు మొత్తం 548 రోజులు జైల్లో గడిపాడు. పెరోల్ పై బయట ఉన్న 256 రోజులను మినహాయించన జైలు అధికారులు... మిగిలిన కాలానికి అతడికి కూలీ కట్టిస్తున్నారు. ‘సెమీ స్కిల్డ్ వర్కర్’ కింద పరిగణించి, అతడితో పేపర్ బ్యాగులు తయారు చేయించారు. ఇందుకు అతడికి రోజువారీ కూలీ కూడా ఇచ్చారు. సాధారణంగా జైల్లో ఒక రోజు పనిచేస్తే.. ఖైదీలకు రూ.35 కూలీ చెల్లిస్తారు. దీనిని 2015, సెప్టెంబర్ 1 నుంచి రూ.50కి పెంచారు. ఈ లెక్కన ఖైదీగా సంజయ్ దత్ జైల్లో గడిపిన కాలం, అతడు పనిచేసిన రోజులను లెక్కించిన జైలు అధికారులు... మొత్తమ్మీద అతడు రూ.38,000 కూలీ సంపాదించినట్లు తేల్చారు. అయితే అందులో మెజారిటీ మొత్తాన్ని అతడు ఇప్పటికే ఖర్చు పెట్టేశాడు. జైల్లోని క్యాంటీన్ లో తనకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసిన అతడు ఆ మొత్తాన్ని దాదాపుగా వాడేశాడు. ఇలా అతడు అక్కడ సంపాదించి అక్కడే ఖర్చు పెట్టేయగా... ప్రస్తుతం అతడి కూలీలో కేవలం రూ.450 మాత్రం మిగిలిందట. విడుదల సందర్భంగా ఈ మొత్తాన్ని జైలు అధికారులు సంజయ్ దత్ చేతిలో పెట్టి అతడిని బయటకు పంపనున్నారు.