: 'సీయూ బ్యాక్, గోరేపానీ నార్మల్'... కూలిన విమానం పైలట్ రోషన్ మనన్దార్ ఆఖరి మాటలు!
ఈ ఉదయం నేపాల్ లోని పోఖారా విమానాశ్రయం నుంచి జాన్ సోమ్ కు బయలుదేరిన తారా ఎయిర్ కు చెందిన వైకింగ్ డీహెచ్ సీ6-400 విమానం పర్వతాల్లో కూలిపోయిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. పోఖారా చీఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జసోదా సుబేదీ అందించిన వివరాల ప్రకారం 7:50 గంటలకు విమానం టేకాఫ్ అయింది. కాస్సేపటి తరువాత పోఖారా నుంచి జాన్ సోమ్ ట్రాఫిక్ కంట్రోల్ కు అనుసంధానమవుతూ, ఫ్లయిట్ కెప్టెన్ రోషన్ మనన్దార్ "సీయూ బ్యాక్... గోరేపానీ నార్మల్" అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలను బట్టి, గోరేపానీ ప్రాంతంలో వాతావరణం ప్రశాంతంగానే ఉందని తెలుస్తోంది. ఆపై జాన్ సోమ్ తో కాంటాక్ట్ కావాల్సిన పైలట్ ఆ పని చేయలేదు. విమానం టేకాఫ్ అయిన సమయంలో ఎయిర్ పోర్టు నుంచి సుమారు 5 కి.మీ దూరం స్పష్టంగా కనిపించేలా వాతావరణం ఉంది. వాతావరణం బాగాలేని కారణంగా విమానం మరో మార్గాన్ని ఎంచుకుని ఉండవచ్చని భావిస్తున్నామని సుబేదీ తెలిపారు. ఆపై ఎన్నిమార్లు విమానంతో కాంటాక్టు కోసం అధికారులు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. విమానంలో ప్రయాణించిన వారి జాబితాను తారా ఎయిర్ విడుదల చేసింది. ఈ విమానంలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.