: లాతూర్ లో శివాజీ జయంతి వివాదం... ముస్లిం పోలీసుతో బలవంతంగా 'జై భవానీ' నినాదం!


మహారాష్ట్రలోని లాతూరులో జరిగిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు వివాదాస్పదమయ్యాయి. బందోబస్తులో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ యూసఫ్ షేక్ ను చుట్టుముట్టి రాళ్లతో కొట్టిన అల్లరిమూక ఆయన చేతికి కాషాయ జెండాను ఇచ్చి పరేడ్ చేయించాయి. 'జై భవానీ' అని నినదించాలంటూ హింసించారు. ఈ ఘటన 19వ తేదీన జరుగగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతిలో కాషాయ జెండాతో తలవంచుకుని నిరసనకారుల మధ్య నడుస్తున్న యూసఫ్ చిత్రాలను మహారాష్ట్ర పత్రికలు ప్రచురించాయి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఏఎస్ఐపై దాడికి పాల్పడ్డ 15 మందిని అరెస్ట్ చేశామని మహారాష్ట్ర హోం మంత్రి రాం షిండే తెలిపారు. కాగా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో వచ్చిన కథనం ప్రకారం, 19వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో లాతూర్ లోని ఓ సమస్యాత్మక ప్రాంతంలో కాషాయ జెండా ఎగురవేయాలని పదుల సంఖ్యలో నిరసనకారులు ప్రయత్నించారు. ఆ సమయంలో రాణేపూర్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కె.అవాస్కర్ వారిని నిలువరించారు. ఇలా చేస్తే మత ఘర్షణలు వస్తాయని హెచ్చరించి వారిని పంపేశారు. అప్పటికి వెళ్లిపోయిన ఆందోళనకారులు తిరిగి కాసేపటికి అదే ప్రాంతానికి రావడంతో యూసఫ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన జరిగింది. దాడి ఘటనలో గాయపడ్డ యూసఫ్ ను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News