: అర్ధరాత్రి హైడ్రామా!...పోలీసులకు లొంగిపోయిన జేఎన్ యూ విద్యార్థి నేతలు ఖలీద్, భట్టాచార్య
పార్లమెంటుపై దాడి దోషి అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ జరిగిన ర్యాలీ... ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని నిప్పుల కుంపటిలా మార్చేసింది. ఈ నెల 9న ర్యాలీ జరగగా, దీనిపై వివాదం రేకెత్తగా ఈ నెల 12న వర్సిటీ స్టూడెంట్ యూనియన్ నేత కన్నయ్య కుమార్ సహా ఆరుగురిపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. 12న కన్నయ్య అరెస్ట్ తో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వర్సిటీలో గడచిన మూడు రోజులుగా హైడ్రామా నెలకొంది. కన్నయ్య అరెస్ట్ తర్వాత పరారైన ఐదుగురు నిందితులు మొన్న వర్సిటీకి తిరిగివచ్చారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించడం, విద్యార్థులు ససేమిరా అనడంతో గడచిన రెండు రోజులుగా ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిన్న రాత్రి ఐదుగురు విద్యార్థుల్లో ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకున్న హైడ్రామా వర్సిటీలో హైటెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఇక మిగిలిన మరో ముగ్గురు నిందిత విద్యార్థులు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం.