: బావ వద్దకు బాలయ్య!.. బెజవాడలో నేటి సాయంత్రం భేటీ
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి వద్దకు వెళుతున్నారు. హైదరాబాదు నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న బాలయ్య, అక్కడి సీఎం క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ఉత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబుకు బాలయ్య ఆహ్వాన పత్రిక అందిస్తారు. ఈ నెల 27 నుంచి లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయి. లేపాక్షి ప్రాచీన వైభవం ఉట్టిపడేలా ఈ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. బాలయ్య అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ ఉత్సవాలకు రావాలంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు జాతీయ స్థాయి ప్రముఖులకు కూడా బాలయ్య స్వయంగా ఆహ్వానాలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వాధినేతగా ఉన్న తన బావకు ఆహ్వానం పలికేందుకు బాలయ్య వెళుతుండడంపై ఆసక్తి నెలకొంది.