: చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నిస్సిగ్గుగా నీతిమాలిన రాజకీయం చేశారని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని, పదవులు, కోట్లు ఆశచూపి తమ పార్టీ తరఫున విజయం సాధించిన నేతలను, తన పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా పార్టీ మారని ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ అని ఆయన చెప్పారు. తాను ఎంతో ప్రాముఖ్యతనిచ్చిన నేతలు పార్టీ మారడం తనను బాధించిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చాడని వారు టీడీపీలో చేరారో చెప్పాలని, వారంతా ఎందుకు తమ పార్టీని వీడాల్సి వచ్చిందో ప్రజలకు, వారి మనస్సాక్షికి సమాధానం చెప్పాలని ఆయన సూటిగా అడిగారు. చంద్రబాబునాయుడు జీవితం మొత్తం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటూనే రాజకీయం చేశాడని అన్నారు. భూమా నిర్ణయం తనను చాలా బాధించిందని చెప్పిన ఆయన, ఆ కుటుంబం తన కుటుంబం లాంటిదేనని ఆయన చెప్పారు. చంద్రబాబు జీవిత కాలం మొత్తం ఇలాగే సాగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కుట్రతోనే సొంత మామను వెన్నుపోటు పొడిచాడని ఆయన చెప్పారు. ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అదే తానైతే, ఇలా పార్టీ మారిన వారిని, ముందు వారి పదవులకు రాజీనామా చేయించి, ప్రజల్లోకి పంపి, వారి మద్దతుతో గెలిపించుకుని, పదవులు ఇచ్చేవాడినని ఆయన తెలిపారు.