: పేద అమ్మాయిల పెళ్లిళ్లకు విరాళంగా రూ.200 కోట్లు
దేశ వ్యాప్తంగా ఉన్న పేద అమ్మాయిల పెళ్లిళ్లకు సూరత్ వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్ లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ రూ.200 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాల్జీ భాయ్ మాట్లాడుతూ, సామాజిక కార్యకర్త, మత ప్రబోధకురాలు సాథ్వి రితంబర స్ఫూర్తితోనే పేదపిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చానని అన్నారు. దేశ వ్యాప్తంగా పదివేల మంది బాలికల తల్లిదండ్రులను ఎంపిక చేసి, వారి వివాహాల నిమిత్తం ఒక్కొక్కరి పేరిట రూ.2 లక్షలు ఇవ్వనున్నామని, వచ్చే మార్చి 13న ఈ పథకాన్ని సూరత్ లో ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, నాడు మోదీ ధరించిన అతి ఖరీదైన సూట్ ను వేలం పాటలో లాల్జీభాయ్ దక్కించుకున్నారు. ఈ సూట్ కోసం రూ.4 కోట్ల 31 లక్షలు ఆయన చెల్లించారు. లాల్జీ భాయ్ గతంలో ఎంతోమందికి సాయపడ్డారు.