: బంతి ఏపీ స్పీకర్ కోర్టుకు! కోడెల ఏం చేసేనో?
ఏపీలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోర్టుకు చేరింది. తమ పార్టీ టికెట్ పై గెలిచి, ఆపై రాజీనామాలు చేయకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి తదితరులు కోడెలను కోరారు. రాజకీయాల్లో అత్యంత నీచ సంస్కృతికి చంద్రబాబు తెరలేపారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్యేలు, వీరంతా రాజీనామాలు చేసి ప్రజల తీర్పును కోరాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ, ఏపీలోనూ అటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కోడెలను ప్రత్యేకంగా కలిసి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని వారు తెలిపారు. కాగా, ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం, రాజీనామాలు చేసినప్పటికీ, వాటిని ఆమోదించాలా? వద్దా? వారిపై అనర్హత తదితరాంశాలన్నీ స్పీకర్ విచక్షణలో ఉండేవే. నిబంధనల్లో లోపాల కారణంగానే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఫిరాయింపుల విషయంలో వెసులుబాటు అధికం. తెలంగాణలో జరిగింది ఇదే. తెలుగుదేశం టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసిన వారిలో కొందరు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేసినా వాటిని తెలంగాణ స్పీకర్ ఆమోదించలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఏపీ స్పీకర్ కోడెల సైతం అదే దారిలో నడుస్తారా? లేక సంచలన నిర్ణయం తీసుకుని, వైకాపా డిమాండ్ కు అనుగుణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.