: ఇక జ్యోతుల వంతు!... టీడీపీ ‘ఆకర్ష్’పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీని లాగేసిన ఏపీలో అధికార పార్టీ టీడీపీ... విపక్ష వైసీపీకి భారీ షాకే ఇచ్చింది. అప్పటిదాకా తమతో 20 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు, టీడీపీ ఇచ్చిన షాక్ తో నిన్నంతా మీడియా ముందుకు రావడానికే జంకారు. నేటి ఉదయం ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తిరుపతి కేంద్రంగా టీడీపీ ‘ఆకర్ష్’పై నిప్పులు చెరిగారు. తాజాగా అసెంబ్లీలో వైసీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ మీడియా ముందుకు వచ్చారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జ్యోతుల విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలను కట్టడి చేసుకోవాలని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా ఆయన భగ్గుమన్నారు. కట్టడి చేసుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు జంతువులేమీ కాదని ఆయన అన్నారు. అయినా నిన్న టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు... ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారు తప్పించి, టీడీపీతో కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జ్యోతుల డిమాండ్ చేశారు.