: కన్నయ్య కుమార్ ను ప్యాంటు తడుపుకునేలా కొట్టాం: 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్లో నిస్సిగ్గుగా న్యాయవాదులు
ఇండియా టుడే చానల్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్ అనంతరం ప్రసారం చేసిన వీడియో ఒకటి సంచలనం కలిగిస్తోంది. కన్నయ్య కుమార్ ను పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో దాడి చేసిన న్యాయవాదుల్లో ఇద్దరితో మాట్లాడుతూ, వారు వెల్లడించిన వివరాలను సీక్రెట్ కెమెరాతో చానల్ రికార్డు చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న కన్నయ్యను తాము మూడు గంటల పాటు విపరీతంగా కొట్టామని, ఆయన ప్యాంటు తడుపుకున్నాడని నిస్సిగ్గుగా చెప్పిన న్యాయవాదులు విక్రమ్ సింగ్ చౌహాన్, యష్ పాల్ సింగ్ లు, కన్నయ్య భారత్ కు అనుకూలంగా నినాదాలు చేసిన తరువాతనే వదిలి పెట్టామని చెప్పుకొచ్చారు. జాతికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన విద్యార్థులను కోర్టుకు తీసుకొస్తే మరోసారి ఇంకా పెద్ద దాడిని చేస్తామని కూడా వారు వెల్లడించడం గమనార్హం. కాగా, ఈ వీడియోను పరిశీలించకుండా తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేమని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించడం గమనార్హం. కాగా, వీరిద్దరితో పాటు మరో న్యాయవాది ఓం శర్మకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.