: ఉగ్రదాడి జరిగితే ఎదుర్కోవడానికి రెడీ... పార్లమెంట్ ఎదుట మోహరించిన క్షిపణి నిరోధక వాహనాలు!
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడులు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అత్యాధునిక సైనిక వాహనాలను, సాయుధ దళాలను మోహరించారు. వీటిల్లో భాగంగా క్షిపణి నిరోధక బులెట్ ప్రూఫ్ వాహనం అందరినీ ఆకర్షిస్తోంది. డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన ఈ టూ సీటర్ వాహనం, ముందు వెనుకలతో పాటు పక్కలకు కూడా కదులుతుంది. ఎటువైపు కావాలంటే అటువైపు తిరుగుతుంది. 4.5 టన్నుల బరువుండే ఈ 'కామోఫ్లేజ్' వాహనంలో విపత్కర పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆయుధాలు ఉంటాయి. లోపలున్న వారికి ఎటువంటి హాని కలుగకుండా, ముష్కరులకు అతి దగ్గరగా వెళ్లి వారిని హతమార్చే సౌకర్యమూ ఉంటుంది. దీన్ని రూపొందించిన డీఆర్డీవో ట్రయల్స్ నిర్వహించాలని గతంలో సీఆర్పీఎఫ్ దళాలకు అందించింది. చూడటానికి చిన్నగా కనిపించే ఈ వాహనం అత్యంత శక్తిమంతమైనదని అధికారులు వివరించారు.