: ఇండియాలో మరిన్ని కుల ఉద్యమాలు పుట్టుకొస్తాయి!: 'న్యూయార్క్ టైమ్స్' జోస్యం
"ఇండియా రాజధాని ఢిల్లీ నగరానికి మంచినీరు అందడం లేదు. వందలాది రైళ్లు నిలిచిపోయాయి. 300 కిలోమీటర్ల విమాన ప్రయాణానికి రూ. 50 వేలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి. తమకు ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని హర్యానాలో జాట్ కులస్తులు హింసకు దిగడంతో ఏర్పడిన పరిస్థితి ఇది. ఇక జాట్లు తమ కోరికను నెరవేర్చుకోగలిగితే, ఇండియాలో మరిన్ని కుల ఉద్యమాలు పుట్టుకొస్తాయి" జాట్ల ఉద్యమంపై ప్రముఖ అమెరికన్ దినపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' ప్రత్యేక కథనమిది. దశాబ్దాలుగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు సమాజంలోని పేద వర్గాలను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తూ, వారికి 50 శాతం రిజర్వేషన్లను దగ్గర చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, మిగిలిన వర్గాల ప్రజలంతా విద్య, ఉద్యోగాలకు దూరం కావడంతోనే ఉద్యమాల బాట పడుతున్నారని, ఇండియాలో వివిధ రాష్ట్రాల్లోని 2000కు పైగా కులాలు వెనుకబడిన తరగతుల్లో ఉన్నాయని గుర్తు చేసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాట్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమని చెప్పిందని, అయితే దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుందని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పటేల్ వర్గం వారు ఇదే తరహా ఉద్యమం చేస్తున్నారని ఆ పత్రిక రాసింది. ఆంధ్రప్రదేశ్ లో మరో వర్గం హింసాత్మక ఘటనకు దిగి ఓ రైలును తగలబెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తక్షణం రిజర్వేషన్ల సమస్యను తీవ్రంగా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఏ వర్గాన్ని కొత్తగా చేర్చినా, పెను ఉద్యమాలతో భారత్ అట్టుడుకుతుందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.