: బీజేపీ కుట్రలు చేస్తోంది: సీపీఐ నేత సురవరం
బీజేపీ కుట్రలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో దేశ విభజనకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. తమకు నచ్చని వారిని దేశం విడిచి వెళ్లిపోండంటూ, ఇటీవలి కాలంలో పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం విడిచిపొమ్మనడానికి దేశం ఎవడబ్బ సొత్తు కాదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారం చేపట్టిన తరువాత 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు అప్పగించిందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఛాయ్ వాలా కాదని, చాయ్ హోటల్ యజమాని కొడుకని ఆయన స్పష్టం చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ విద్యార్థి నాయకులను సమాజంలో తిరగకుండా చేశారని ఆయన మండిపడ్డారు. బ్రిటిష్ వారి తొత్తులతో పొత్తుకట్టిన పార్టీ బీజేపీ అని ఆయన ఆరోపించారు.