: 26 లక్షల ఖర్చుతో టాయిలెట్...జస్ట్ ఒక రోజు కోసం!
స్వచ్ఛభారత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాయిలెట్లు కట్టించేందుకు ప్రతి ఇంటికి 15 నుంచి 20 వేల రూపాయలు మంజూరు చేస్తున్నాయి. ఈ మొత్తంతో టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. అయితే ప్రపంచ పేద దేశాల్లో ఒకటిగా చెప్పుకునే కంబోడియాలో ఒక టాయిలెట్ నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం 26 లక్షల రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇంత ఖర్చు చేసి ఆ టాయిలెట్ ను ఒకే ఒక్కమనిషి ఒకే ఒక్కరోజు వినియోగించేందుకు నిర్మించడం విశేషం. కంబోడియాలో అత్యంత పేద ప్రాంతమైన రతనక్కిరి ప్రావిన్స్ ప్రాంతానికి ధాయ్ లాండ్ రాణి మహాచక్రి సిరింధోర్న్ మూడు రోజుల పర్యటనకు రానున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ఇయాక్ లామ్ సరస్సు ఒడ్డున ఆమెకు సర్వాంగ సుందరమైన టాయిలెట్ ను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆమె ఒక్కరోజు ఉంటారు. అనంతరం అందులోని ఖరీదైన సామగ్రిని ధాయిలాండ్ పంపించి, దీనిని కూల్చేస్తారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాయిలెట్ కు అంత ఖర్చు ఎందుకని మండిపడుతున్నారు. అయితే, ఈ టాయిలెట్ ను ఆ తరువాత ఆఫీసుగా మారుస్తారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు!