: కేసీఆర్ దత్తత గ్రామంలో టీ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి
ఓ వైపు టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ వలకు చిక్కి టీ టీడీపీ విలవిల్లాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తే...ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ‘సైకిల్’ దిగేసి కారెక్కేశారు. ఇంకో ఇద్దరు టీ టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ క్రమంలో టీ టీడీపీకి మిగిలేది ముగ్గురేనని కూడా గులాబీ పార్టీ బాహాటంగానే చెప్పింది. ఆ మిగిలే ముగ్గురిలో టీ టీడీఎల్పీ నేతగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఒకరు. అధికార పార్టీ ఎంతమేర ఇబ్బందులకు గురి చేసినా, వెనక్కు తగ్గకూడదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుంది. కొద్దిసేపటి క్రితం ఆయన కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్నముల్కనూరులో కాలుమోపారు. కరీంనగర్ జిల్లాలోని చిన్నముల్కనూరును కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామ రూపురేఖలే మార్చేస్తానని దత్తత సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు కూడా. తాజాగా ఆ గ్రామంలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి... అక్కడ జరుగుతున్న పలు కార్యక్రమాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ దత్తత గ్రామంలో జరుగుతున్న పనులనే పరిశీలించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి... అటు టీఆర్ఎస్ నేతలనే కాక తన సొంత పార్టీ టీ టీడీపీకి చెందిన నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు.