: విజయవాడ చేరిన ఆదినారాయణ రెడ్డి... సాయంత్రం చంద్రబాబుతో భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేటి సాయంత్రానికి పెద్ద షాక్ తగలడం ఖాయంగానే కనిపిస్తోంది. తన పార్టీకి చెందిన కీలక నేత, తన సొంత జిల్లా కడపకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరేందుకు దాదాపు కార్యరంగం సిద్ధమైంది. టీడీపీ అధిష్ఠానం ఇచ్చిన సమాచారంతో నిన్న రాత్రే కడప నుంచి బయలుదేరిన ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. నేటి సాయంత్రం ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగుకు చెందిన టీడీపీ ఇంచార్జీ, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పిన చంద్రబాబు... ఆది చేరికకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించేశారు. ఈ క్రమంలోనే ఆదికి విజయవాడ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో భేటీ ముగియగానే టీడీపీలో చేరుతున్నట్లు ఆదినారాయణ రెడ్డి అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే... చేరిక సమయంలోనే ఆది, రామసుబ్బారెడ్డిల మధ్య ఉన్న రాజకీయ వైరానికి తెర దించేందుకు చంద్రబాబు పథక రచన చేశారు. ఆది తనతో భేటీ అయ్యే సమయంలోనే మీరు కూడా రండి అంటూ రామసుబ్బారెడ్డికి చంద్రబాబు సందేశం పంపారు. దీంతో తన అనుచరులతో కలిసి నేటి ఉదయం రామసుబ్బారెడ్డి విజయవాడ బయలుదేరారు.