: బయటకు వచ్చిన భూమా... పీఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తారంటూ వదంతులు
వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యం లభించిన రెండు కుటుంబాల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుటుంబం ఒకటి. గడచిన ఎన్నికల్లో ఇతరులకు ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి దివంగత భూమా శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే టికెట్లను చేజిక్కించుకున్నారు. ఇద్దరూ గెలిచారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందుగా శోభానాగిరెడ్డి చనిపోగా, ప్రస్తుతం భూమా కూతురు అఖిలప్రియ ఆమె స్థానంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించలేని వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. ప్రతిపక్ష పార్టీకి దక్కే పీఏసీ కమిటీ చైర్మన్ పదవి కూడా భూమా ఖాతాలోకే చేరింది. ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ వైసీపీని వీడేందుకు భూమా నాగిరెడ్డి దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రవేశించిన పార్టీ టీడీపీలో చేరి సొంత గూటికి చేరాలని భూమా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారం రోజులుగా టీడీపీలోకి భూమా చేరికపై ఊహాగానాలు సాగుతున్నాయి. దీంతో ఐదారు రోజులుగా బయట మీడియాకు కనిపించకుండా పోయిన భూమా కొద్దసేపటి క్రితం బయటకు వచ్చారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమైనా మాట్లాడతారా? అన్న కోణంలో మీడియా ప్రతినిధులు అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే... పీఏసీ చైర్మన్ పదవికి భూమా రాజీనామా చేయనున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న ఆయన పలు కీలక ఫైళ్లను కమిటీకి అప్పజెప్పాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన స్వయంగా సమావేశానికి హాజరయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.