: భార్య రాసిన ఆ లేఖ క్రూరత్వమే... 26 ఏళ్ల అనంతరం విడాకులిచ్చిన ఢిల్లీ హైకోర్టు


భర్త దూరంగా ఉన్నాడన్న మనస్తాపంతో ఆ భార్య ఘాటుగా రాసిన ఓ లేఖ, ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ లేఖ క్రూరమైనదని అభివర్ణించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నజ్మీ వజీరి విడాకులు మంజూరు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, 1980లో వివాహమైన ఓ జంటకు ఓ కుమార్తె ఉంది. 1987లో భర్త ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లిపోయాడు. ఆపై 1990లో తనకు విడాకులు కావాలని, తన చిన్న నాటి మిత్రుడు వివాహం చేసుకుని, కుమార్తె ఆలనాపాలనా చూసేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. దీని ఆధారంగా ఆ వ్యక్తి, ట్రయల్ కోర్టులో విడాకుల నిమిత్తం కేసు వేయగా, 1995లో విచారణకు వచ్చింది. తాను అబద్ధం చెప్పానని, అతనితోనే కలసి జీవించాలని ఉందని భార్య వెల్లడించగా, విడాకులు మంజూరు చేయలేమని కోర్టు తీర్పిచ్చింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు, భార్య చాలా క్రూరంగా లేఖ రాసిందని, దీంతో దాదాపు నాలుగైదేళ్లు అతని మనసు ఎంత వికలమై ఉంటుందో తాము ఊహించగలమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో వ్యక్తిని భర్త స్థానంలోకి తెచ్చుకుంటానని ఆమె రాసిన లేఖ ఎంతో మానసిక వేదనను కలిగిస్తుందని, అది ఆమె క్రూరత్వానికి నిదర్శనమేనని అన్నారు. 1987 నుంచి దూరంగా ఉంటున్న జంటకు విడాకులు మంజూరు చేయడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడామె హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయాలని భావిస్తోంది. ఏళ్ల తరబడి భర్త ప్రేమకు నోచని తాను, విడాకులు కావాలని కోరడం వెనుక, భర్తను తిరిగి ఇంటికి రప్పించాలన్న ఒకే కారణముందని చెబుతోంది. కాగా, 1990లో కేసు నమోదు కాగా, తాను ఆ లేఖను ఏ ఉద్దేశంతో రాశానన్న విషయాన్ని ఇంతవరకూ కోర్టుకు ఎందుకు తెల్పలేదని భర్త తరఫు న్యాయవాది మన్ జిత్ సింగ్ అహ్లూవాలియా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News