: బంగ్లాలో పేట్రేగిన ఐఎస్... హిందూ పూజారి దారుణ హత్య
ఇరాక్, సిరియాల్లో పెను దారుణాలకు ఒడిగడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తాజాగా భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ లోకీ అడుగుపెట్టారు. అంతేకాదు, అక్కడి ఓ హిందూ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న పూజారిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగని ఐఎస్ ముష్కరులు ఈ దారుణం తమ పనేనని ట్విట్టర్లో నిర్భయంగా ప్రకటించుకున్నారు. వివరాల్లోకెళితే... బంగ్లాదేశ్ లోని పంజాగఢ్ లోని దేవీ గంజ్ ఆలయంలో జోగేశ్వర్ రాయ్ (55) పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న ఆలయ పరిసరాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేస్తుండగా, ఐదారుగురు ఉగ్రవాదులు ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు. కత్తులతో గొంతు కోయడంతో యోగేశ్వర్ అక్కడికక్కడే చనిపోయారు. యోగేశ్వర్ ను కాపాడేందుకు యత్నించిన ఓ భక్తుడిపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు అతడిని గాయాలపాల్జేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా... ఈ దుర్మార్గానికి పాల్పడింది తామేనని ఐఎస్ ముష్కరులు పేర్కొన్నారు.