: 'పాకిస్థాన్ జిందాబాద్' అంటే సమస్యేంటి? కోర్టులో డీఎస్పీకి ఎదురైన ప్రశ్న!
"పాకిస్థాన్ జిందాబాద్ అని ఎవరైనా నినదిస్తే, మీకు వచ్చే సమస్యేంటి?"... ఇది ఓ న్యాయవాది వేసిన ప్రశ్న. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందన్న వార్త విన్న తరువాత కోర్టులోనే పాక్, తాలిబాన్లకు అనుకూల నినాదాలు ఇచ్చాడన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న సిమీ కార్యకర్త పర్వేజ్ ఆలమ్ తరఫు న్యాయవాది కోర్టులో ఓ డీఎస్పీ స్థాయి అధికారిని అడిగిన ప్రశ్న ఇది. భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ఈ ప్రశ్న వేసి అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేయగా, సదరు డీఎస్పీ ఏమాత్రం తడుముకోలేదు. కోర్టు పరిసరాల్లో తమ మనోభావాలు, భావజాలాలను వ్యక్తం చేస్తూ, ఎలాంటి నినాదాలు చేయకూడదని గుర్తు చేశారు. అలా నినదించడం భారత శిక్షాస్మృతి మేరకు నేరమని అన్నారు.