: జాతీయ గీతంగా ‘జనగణమన’ వద్దంటున్న హిందీ కవి
ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ నిన్న ఓ సంచలన ప్రకటన చేశారు. జాతీయ గీతంగా మనమంతా ఆలపిస్తున్న ‘జనగణమన’ గీతానికి ఆ హోదా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ లో నిన్న ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ‘జనగణమన’... ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదేనని వ్యాఖ్యానించిన ఆయన, ఈ కారణంగానే ఆ గీతానికి జాతీయ గీతం హోదాను రద్దు చేయాలని పేర్కొన్నారు. ‘జనగణమన’ను జాతీయ గీతంగా రద్దు చేస్తే, దాని స్థానంలో ఏ గీతాన్ని ఎంపిక చేయాలన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ‘వందేమాతరం’, 'ఝండా ఊంచా రహే హమారా’ గీతాల్లో దేనినైనా జాతీయ గీతంగా ప్రకటించుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అసలు ‘జనగణమన’ను జాతీయ గీతంగా వద్దనడానికి ఆయన చెప్పిన కారణం ఏమిటంటే... ‘‘మనందరం బానిసలుగా ఉన్నాం. మన జాతీయ గీతం కూడా మనదేశం బ్రిటిష్ కాలనీగా ఉన్నప్పటిదే. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్... 1911లో యూకే రాజుగా ఐదో జార్జ్ కు పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా రాశారు. బ్రిటిషర్లు ఎప్పుడో వెళ్లిపోయారు. కానీ, ఇప్పటికీ కొంతమంది (ఇంగ్లీష్)కి బానిసలుగా ఉండటాన్ని కొనసాగిస్తున్నారు. వందేమాతరం గీతాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాం? వందేమాతర నినాదంతో ఎంతోమంది హిందువులు, ముస్లింలు అమరులయ్యారు. ‘జనగణమన’ గీతంలో ‘అధినాయక’ అంటే నియంత... ‘జయహే భారత భాగ్య విధాత’ అంటే, దేశ సౌభాగ్యానికి ఆయనే విధాత అని అర్థం. ‘పంజాబ సింధు గుజరాత మరాఠా’లో సింధ్ ఇప్పుడు భారత్ లో ఉందా?’’ అంటూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.