: జాట్ ఆందోళన ఎఫెక్ట్!... ఆకాశాన్నంటిన విమాన ప్రయాణ చార్జీలు
రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన ఆందోళనల కారణంగా హర్యానాలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఏ ఒక్క వాహనాన్ని వదలని జాట్లు ఎక్కడికక్కడ జాతీయ రహదారులను దిగ్బంధించారు. జాట్ల ఆందోళన కారణంగా రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో విమాన చార్జీలు చుక్కలనంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఛండీగఢ్ కాని, ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి కాని వెళ్లాలంటే ఏకంగా రూ.55 వేల దాకా చెల్లించి విమాన టికెట్లు కొనాల్సిన దుస్థితి నెలకొంది. ఈ రెండు నగరాల మధ్య గంట ప్రయాణానికి సాధారణంగా రూ.2,500 నుంచి 3 వేల దాకా విమాన చార్జీలు ఉన్నాయి. అయితే జాట్ల ఆందోళన కారణంగా మొత్తం రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఒక్కసారిగా చార్జీలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ చార్జీలు ఆయా విమానయాన సంస్థలను బట్టి రూ.25 వేల నుంచి రూ.55 వేల దాకా ఉన్నాయి.