: వ్యక్తిగత కక్షలకే 'మేయర్' దంపతులు బలి!... రాజకీయ కుట్ర కోణం లేదన్న పోలీసులు


తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెను సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్యలు... వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే జరిగాయి. ఈ ఘటనలో రాజకీయ కుట్ర కోణం ఎంతమాత్రం లేదని తేలిపోయింది. ఈ మేరకు రోజుల తరబడి విచారణ సాగించిన పోలీసులు ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను ఎట్టకేలకు తేల్చేశారు. హత్యకు గల కారణాలను తేల్చిన పోలీసులు సదరు విషయాలను ప్రస్తావిస్తూ నిన్న చిత్తూరు జిల్లా కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ చార్జిషీటులో కఠారి మోహన్ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ సహా మొత్తం 23 మంది నిందితుల పేర్లను పొందుపరిచారు. కఠారి మోహన్ ను వెన్నంటి నడిచిన చింటూ రాయల్... తదనంతర కాలంలో వీరి కుటుంబానికి వ్యతిరేకిగా మారాడు. ఈ క్రమంలో తన కార్యకలాపాలకు అడ్డు వస్తున్నారన్న నెపంతో చింటూ రాయల్... తన సొంత మేనమామ, అత్తలను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనలో చింటూ రాయల్ అనుచరులు హత్య జరిగిన క్షణాల్లోనే పోలీసులకు లొంగిపోగా, ఆ తర్వాత చాలా రోజులకు అతడు లొంగిపోయాడు. పోలీసుల చార్జిషీటు దాఖలు నేపథ్యంలో ఇక కోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News