: ఓరుగల్లు ఓటర్లకు తాయిలాలు షురూ!... తాగునీటి ఎద్దడికి రూ.8.69 కోట్లు విడుదల
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ సర్కారు పక్కాగా పథక రచన చేసి రంగంలోకి దిగింది. జంట నగరాల వాసులకు భారీ తాయిలాలు ప్రకటించిన అధికార పార్టీ... తాననుకున్న దాని కంటే భారీ విజయాన్నే నమోదు చేసింది. తాజాగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్, పాలమూరు జిల్లాలోని అచ్చంపేట మునిసిపాలిటీలకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రేపు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఆయా పురపాలక సంస్థల ఓటర్లకు తాయిలాల ప్రకటన మొదలైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఓరుగల్లు ఓటర్ల మనసులు దోచేందుకు వరంగల్ నగరంలోని తాగు నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. నగరంలో తాగు నీటి ఎద్దడి నివారణకు రూ.8.69 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.