: బెజవాడలో రౌడీ పోలీస్!... అల్లుడిని హతమార్చేందుకు సుపారీ ఇచ్చిన ఏఎస్సై
పోలీసులే రౌడీలుగా మారుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో మరింత అధికమయ్యాయి. ఈ తరహా ఘటన నిన్న నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వెలుగుచూసింది. సొంత అల్లుడినే హతమార్చేందుకు పక్కా స్కెచ్ వేసి రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చిన నున్న ఏఎస్సై రామారావు, ఆయన నుంచి రూ.5 లక్షలు తీసుకుని రంగంలోకి దిగిన ఐదుగురు హంతకులను సత్యనారాయణపురం పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే... రామారావు కూతురు శ్యామ్ అనే ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన రామారావు బుద్ది వంకర తిరిగింది. నేరస్తులకు సంకెళ్లు వేయాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న రామారావు హంతకులతోనే చేతులు కలిపారు. తన అల్లుడిని హతమారిస్తే... రూ.5 లక్షల సుపారీ ఇస్తానంటూ ఐదుగురు రౌడీ షీటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో శ్యామ్ కు ఫుల్లుగా మద్యం తాగించి, రైలు పట్టాలపై వేయాలని రౌడీలు పథకం రచించుకున్నారు. ఇందులో భాగంగా నిన్న రంగంలోకి దిగిన రౌడీ షీటర్లు శ్యామ్ ఉంటున్న ప్రాంతంలో తచ్చాడుతూ కనిపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో సత్యనారాయణపురం పోలీసులు రంగంలోకి దిగారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, రౌడీ పోలీస్ రామారావు అసలు రంగు బయటపడింది. దీంతో ఐదుగురు రౌడీ షీటర్లతో పాటు రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు.