: జగన్ విశ్వప్రయత్నాలు భూమాను ఆపేనా?
ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. నిన్న కర్నూలు జిల్లా నేత భూమా నాగిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం కర్నూలు రాజకీయ నేతలను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడం, భూమా చేరికను వ్యతిరేకిస్తున్న శిల్పా సోదరులతో పాటు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని చర్చల్లో భాగం చేయడంతో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియల చేరికకు చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. కర్నూలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నప్పటికీ, భూమా వస్తే తమ రాజకీయ జీవితాలు మసక బారుతాయని భావిస్తున్న నేతలు ఎందరో ఉన్నారు. ఇదిలావుండగా, భూమాను వదులుకోరాదని భావిస్తున్న వైకాపా అధినేత, తనకు దగ్గరగా ఉండే నేతలందరినీ రంగంలోకి దించారు. సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకటరమణ తదితరులను రంగంలోకి దించారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఐసయ్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయరాములు తదితరులతో సమావేశమై భూమాను బుజ్జగించాలని అన్నారు. విపక్షంలో ఆయనకు జగన్, తన తరువాత రెండో నేత హోదాను ఇచ్చారన్న విషయాన్ని భూమాకు వెల్లడించాలని, పీఏసీ చైర్మన్ గా ఆయన్నే నియమించామని గుర్తు చేయాలని జగన్ సూచించినట్టు తెలుస్తోంది. జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు భూమాతో సమావేశమై ఆయన సమస్యలు, పార్టీ మారే ఆలోచనపై వచ్చిన వార్తలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ఇక ఆయన వైకాపాను వీడతారా? జగన్ చేస్తున్న ప్రయత్నాలు భూమాను ఆపుతాయా? అన్న ప్రశ్నలకు ఈ సాయంత్రంలోగా సమాధానం లభిస్తుందని అంటున్నారు.