: అరుణాచల్ లో కాంగ్రెస్ రెబల్స్ కు బీజేపీ మద్దతు... సీఎంగా కాలిఖో ప్రమాణం!
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రెబల్ నేత కాలిఖో పుల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తొలగించిన గంటల వ్యవధిలోనే బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి ఆయన గవర్నర్ ను కలిసి తనకు మద్దతిస్తున్నవారి వివరాలు చెప్పడం జరిగింది. ఆపై నిమిషాల వ్యవధిలోనే చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన ప్రమాణ స్వీకార తంతును ముగించేశారు. రాత్రి 9:30 గంటల సమయంలో కాలిఖోతో గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్ ఖోవా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత తాపిల్ గాన్ మాట్లాడుతూ, మొత్తం 31 మంది ఆయనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి తాము బయటి నుంచి మద్దతిస్తామని వివరించారు. కాంగ్రెస్ నుంచి చీలిన 18 మందితో పాటు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాలిఖో వెంట గవర్నర్ వద్దకు వెళ్లి మద్దతు లేఖలిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ, త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని చెప్పారు.