: అట్టుడుకుతున్న హర్యానా... ఆయుధాలు ఎత్తుకెళ్లిన జాట్లు!
తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలో జాట్లు చేస్తున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు 3 వేల మంది కేంద్ర బలగాలను మోహరించింది. ఓ ప్రైవేటు ఆయుధ కేంద్రంపై పడ్డ నిరసనకారులు తుపాకులను ఎత్తుకుపోవడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హైవేలు, రైల్వే ట్రాక్ లను జాట్ వర్గీయులు ఆక్రమించుకోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మొత్తం 500కు పైగా రైళ్లపై ప్రభావం పడింది. రోహ్ తక్ లోని ఆర్ఎన్ మాల్ పై దాడి చేసిన ఆందోళనకారులు దానికి నిప్పు పెట్టి, విలువైన వస్తువులను దోచుకుపోయారు. పోలీసులపై జాట్లు తుపాకులతో కాల్పులు జరపగా,ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మరణించారు.