: నకిలీ అంత్యక్రియలు నిర్వహించుకున్న చైనా వృద్ధుడు!


చైనాలోని ఉత్తర షాన్ డాంగ్ రాష్ట్రానికి చెందిన జాంగ్ డెయాంగ్ (66) బతికుండగానే తనకు తానే అంత్యక్రియలు నిర్వహించుకున్నాడు. ఇలా చేయడానికి ప్రధాన కారణం, ఆయనకు పెళ్లి కాలేదు. దాంతో ఆయనను చుట్టుపక్కల వారెవరూ పట్టించుకునే వారు కాదు. అసలున్నాడో లేదో కూడా ఎవరికీ తెలిసేది కాదన్నట్టు ఉండేది అతని పరిస్థితి. బంధువులు, స్నేహితులు కూడా ఎక్కడో ఉంటారు. దాంతో జాంగ్ కు బెంగ పట్టుకుంది. తాను చనిపోతే అసలు తనకు అంత్యక్రియలు చేస్తారా? అన్న అనుమానం తలెత్తింది. దానికి తోడు, చైనా సంస్కృతిలో చనిపోయిన వాళ్లకు బతికున్నప్పటిలాగే అవసరాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే, చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసినా కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ సమాధులను సందర్శిస్తారు. మరి తనకెవరూ లేనప్పుడు తన సమాధిని ఎవరు చూస్తారని ఆలోచించాడు. ఒకవేళ తాను నిజంగా చనిపోతే తన అంత్యక్రియలకు ఎవరైనా వస్తారా? వస్తే, ఎంతమంది వస్తారు? అన్నది చూడాలనిపించింది. అనుకున్నదే తడవుగా, తన బంధువులను, స్నేహితులను అంత్యక్రియలకు పిలిచాడు. ఈలోగా సమాధి ప్రాంతాన్ని రంగు రంగుల కాగితాలతో అలంకరించాడు, తాను కొత్త బట్టలు ధరించి సిద్ధమయ్యాడు. భార్య లేకుంటే చనిపోయాక చాలా కష్టాలు పడతారన్న చైనా నమ్మకాన్ని అనుసరించి మరణించిన ఓ మహిళతో ఉత్తుత్తి పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాత జాంగ్ గోతిలోకి వెళ్లి శవంలా పడుకున్నాడు. ఈ నకిలీ అంత్యక్రియలకు వచ్చినవారంతా సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారు. మొత్తానికి 40 మంది బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిమంది వచ్చారు. అయితే తాను పిలిచిన వారిలో 20 మంది అంత్యక్రియలకు రాలేదని ఇప్పుడు జాంగ్ బాధపడుతున్నాడు. అన్నట్టు, ఈ తతంగానికంతటికీ రూ.1.70 లక్షల ఖర్చు పెట్టాడీ చైనా వృద్ధుడు.

  • Loading...

More Telugu News