: మాపై బురద జల్లేందుకే బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన కమిటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తమ పార్టీపై బురద జల్లేందుకే ఈ కమిటీ నివేదిక రూపొందించారని ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై వేసిన బుద్ధ ప్రసాద్ కమిటీ ఈరోజు సమావేశమై చర్చించింది. అందులో సభ్యుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఆ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చానని తెలిపారు. తప్పుడు వీడియోలను విడుదల చేసి కొంతమందిపై ప్రభుత్వం బురద జల్లాలని ప్రయత్నిస్తోందని కమిటీకి చెప్పానన్నారు. రోజా సస్పెన్షన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను విడుదల చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ దారుణంగా మాట్లాడినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపానన్నారు.