: పట్టుబడ్డ మరో మాఫియా డాన్! ... సింగపూర్ లో కుమార్ పిళ్లై అరెస్ట్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాన్ ల ఆటలు సాగడం లేదు. ఇప్పటికే మూడు దశాబ్దాలుగా ముంబై పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగించిన మాఫియా డాన్ చోటా రాజన్ ఎట్టకేలకు పట్టుబడిపోయాడు. తాజాగా ముంబైలో పలు హత్యలు, బెదిరింపులకు పాల్పడ్డ మరో మాఫియా డాన్ కుమార్ పిళ్లైని పోలీసులు పట్టేశారు. సింగపూర్ లో అతడు అరెస్టైనట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఇంటర్ పోల్ అతడిపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు తారసపడ్డ కుమార్ పిళ్లైని సింగపూర్ పోలీసులు పట్టేశారు. నిషేధిత ఎల్టీటీఈతో సంబంధాలున్న కుమార్ పిళ్లై... ముంబైలోని విక్రోలీలో గతంలో స్వైర విహారం చేశాడు. రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని అతడు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్దాడు. ఈ క్రమంలో పలు హత్యలతో పాటు బెదిరింపులకు సంబంధించి అతడిపై ముంబైలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కుమార్ పిళ్లైని అరెస్ట్ చేశామన్న సింగపూర్ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు అరెస్టైన వ్యక్తి అతడేనా అన్నది నిర్ధారించుకునే పనిలో పడ్డారు. అతడేనని తేలితే, అతడిని దేశానికి రప్పించేందుకు ముంబై పోలీసులు చర్యలు చేపడతారు.