: టీ పోలీసులపై అసోంలో దాడి... కాల్పులు జరిపిన దుండగులు అరెస్ట్
నేరగాళ్ల పీచమణిచేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రాల సరిహద్దులు దాటేస్తున్నారు. సూర్యాపేట షూటర్స్ గా నల్లగొండ జిల్లాలో రోజుల తరబడి ఉద్రిక్తతలకు కారణమైన ఉగ్రవాదుల సన్నిహితులపై విశ్వసనీయ సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు ఒడిశాలోని రూర్కెలా వెళ్లారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపినా, వెనుకడుగు వేయకుండా మూడు గంటల పాటు ఎదురు కాల్పులు జరిపి ఎట్టకేలకు నలుగురు కరుడుగట్టిన ముష్కరులను అరెస్ట్ చేశారు. తాజాగా అదే తరహాలో అసోం వెళ్లిన తెలంగాణ పోలీసులపై అక్కడ కూడా దాడి జరిగింది. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అసోం రాజధాని గువాహటి వెళ్లిన టీ పోలీసులపై అక్కడ కూడా దాడి జరిగింది. పోలీసుల రాకను గుర్తించిన ముష్కరులు వారిపైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన టీ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి రివాల్వర్, నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులకు సంకెళ్లేసి మరీ రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసు బాసులు పొంతన లేని కథనాలను వినిపిస్తుండటం గమనార్హం. తమ పోలీసులపై దాడి చేయలేదని ప్రకటించిన సైబర్ క్రైం డీసీపీ జయరామ్... నిందితులను పట్టుకున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.