: అనకొండలున్న చోట తలపెట్టిన షేన్ వార్న్!
"నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట" చిన్నప్పుడు అందరూ విన్న కథే ఇది. తన ప్రాంతానికి వచ్చి వేలు పెడితే, చీమలే కుడతాయే... మరి పాముల మధ్య తలే పెడితే... అవి కాటేయవా? మరి తెలిసే అటువంటి సాహసానికి పూనుకున్నాడు లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్. అయితే, ఆ పాములు అంతగా విషపూరితాలు కాకపోవడం, గట్టి కాట్లు పడకపోవడంతో స్వల్ప గాయంతో బయటపడ్డాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఆస్ట్రేలియాలో నడుస్తున్న నెట్ వర్క్ 10 నిర్వహించిన ఓ రియాల్టీ షోలో అందరూ చూస్తుండగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వార్న్ ఓ టాస్క్ చేశాడు. చిన్న చిన్న అనకొండ పిల్లలున్న గాజు తొట్టిలో తలపెట్టాడు. ఆయన సాహసమైతే చేశాడు గానీ, ఓ బుల్లి అనకొండ మాత్రం వార్న్ పై పగ తీర్చుకుంది. దీంతో వార్న్ తలపై చిన్న గాట్లు పడ్డాయి. అదే గాజు తొట్టిలో ఉన్న మరి కాస్త పెద్ద పాము కాటేసి వుంటే దీర్ఘకాలం పాటు వార్న్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చి ఉండేదట. అన్నట్టు ఆ అనకొండ కాటేసిన తరువాత, వార్న్ ఆసుపత్రికి వెళ్లగా, ఇంకా చికిత్స పూర్తి కాలేదని తెలుస్తోంది.