: ఏడాదికొకసారి గడ్డం గీసుకుంటానంటే కుదరదు : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
ప్రతి మనిషి పరిశుభ్రంగా ఉండాలి.. అట్లానే మనస్సూ పరిశుభ్రంగా ఉండాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు నిర్వహించిన ‘స్వచ్ఛ చిలకలూరిపేట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఒళ్లు, పళ్లు, ఇళ్లు, గుళ్లు, బళ్లు.. ఇరుగు పొరుగు.. ఇట్లా ప్రతిఒక్కటీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు అనేవి ప్రతిఒక్కరికి చాలా అవసరమని వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పరిశుభ్రత గురించి ప్రస్తావిస్తూ వెంకయ్యనాయుడు తనదైన శైలిలో హాస్యపూరిత ప్రసంగాన్ని చేశారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే గడ్డం చేసుకుంటామంటే కుదరదని.. సాధువులా తయారైపోతామని అన్నారు. 2019 నాటికి భారతదేశాన్ని స్వచ్ఛభారత్ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారని అన్నారు. మన రాష్ట్రం, నగరాలు స్వచ్ఛంగా ఉండాలని ఆశిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు.