: కడపలో టీడీపీకి డేంజర్ బెల్స్!... కలకలం రేపుతున్న రామసుబ్బారెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విపక్షాల ఎమ్మెల్యేలకు విసిరిన ‘ఆకర్ష్’ వల తరహాలో ఏపీలోనూ ‘గేట్లెత్తేద్దాం’ అన్న టీడీపీ వ్యూహానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ తరహా మంత్రానికి తెరతీద్దామన్న ఆ పార్టీ నేతలకు అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి నిరసన గళం వినిపించారు. తన అభ్యంతరాలను పెడచెవినబెట్టి వైసీపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే, తాను పార్టీ వీడటం ఖాయమన్న రీతిలో రామసుబ్బారెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు కడప జిల్లాలో పెద్ద చర్చకే తెర తీశాయని చెప్పాలి. కడప జిల్లాలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొని ఆది నుంచి టీడీపీ తరఫున అలుపెరగని సైనికుల్లా పోరాడుతున్న వారిలో ఒకరు ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి కాగా, మరొకరు రామసుబ్బారెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. షాద్ నగర్ జంట హత్యల కేసులో దోషిగా తేలిన సమయంలో ఉమ్మడి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న రామసుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించి వచ్చిన రామసుబ్బారెడ్దికి నేటికీ ఆ జిల్లాలో పట్టు ఉంది. పెట్టని కోటలా కార్యకర్తల అండ ఉంది. పార్టీ ప్రమేయం లేకుండా రామసుబ్బారెడ్డి రోడ్డెక్కితే, ఆయన వెంట నడిచే టీడీపీ కార్యకర్తలు చాలా మందే ఉన్నారు. ఈ కారణంగానే రామసుబ్బారెడ్డి పదవిలో లేకున్నా, చంద్రబాబు వద్ద మాత్రం పలుకుబడి ఉంది. అంతేకాకుండా టీడీపీ తప్ప తనకు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ లేదన్న రీతిలో రామసుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి పార్టీ వీడితే... కడప గడపలో టీడీపీకి భారీ ఎదురు దెబ్బ తప్పదు. ఇక ఆదినారాయణ రెడ్డి విషయానికి వస్తే... మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న ఆదినారాయణ రెడ్డి... వైసీపీలో చేరే విషయంలో ముందు తటపటాయించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన వైసీపీ గూటికి చేరారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఓ భక్తుడిలా ఉన్న ఆదినారాయణ రెడ్డిలో వైఎస్ జగన్ పట్ల ఆ తరహా వైఖరి లేదు. ఈ క్రమంలోనే వైసీపీలో ఆయన చేరిక చాలా ఆలస్యమైంది. అయితే పార్టీలో చేరిన నాటి నుంచే ఆయన ప్లేటు ఫిరాయించేందుకు సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. అయితే రాజకీయంగా చిరకాలంగా ప్రత్యర్థిగా కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి అభ్యంతరాలతో టీడీపీలో ఆయన చేరికకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. తాజాగా మొన్న రామసుబ్బారెడ్డిని విజయవాడ పిలిపించుకున్న చంద్రబాబునాయుడు... ఆదినారాయణ రెడ్డి చేరికకు సంబంధించి సర్దుకుపోవాలని సూచించారు. పార్టీ అభివృద్ధి దృష్ట్యా అది అవసరం కూడా అని చంద్రబాబు చెప్పారు. అయితే ఆది నుంచి ఆదినారాయణరెడ్డి చేరికను వ్యతిరేకించడమే కాక, తన స్పష్టమైన వైఖరి చెప్పినా, ఆదినారాయణరెడ్డిని చేర్చుకునేందుకే చంద్రబాబు మొగ్గుచూపడంతో రామసుబ్బారెడ్డి కాస్తంత ఇబ్బంది పడ్డారు. అయితే అప్పటికప్పుడు తన నిర్ణయం చెప్పని రామసుబ్బారెడ్డి కార్యకర్తలు, కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం చెబుతానని చెప్పి జమ్మలమడుగు వచ్చేశారు. తాజాగా నేటి ఉదయం తన కార్యకర్తలతో భేటీ సందర్భంగా రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు, తన నిర్ణయానికి గౌరవమిచ్చినంత కాలమే తాను టీడీపీలో కొనసాగుతానని రామసుబ్బారెడ్డి ప్రకటించారు. అలా లేని పక్షంలో కన్న తల్లిలాంటి పార్టీని కూడా వీడేందుకు వెనుకాడనన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తే, తాను మాత్రం జమ్మలమడుగు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక చివరగా టీడీపీకే కాక తన మాటకు గౌరవమిచ్చే వేలాది మంది కార్యకర్తలు జమ్మలమడుగులో ఉండటం తనకు బలమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేయక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.