: ఏపీలోనూ కేసీఆర్ బర్త్ డే వేడుకలు... అమలాపురంలో కేక్ కట్ చేసిన అభిమానులు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక్క తెలంగాణలోనే కాదండోయ్... నవ్యాంధ్రలోనూ అభిమానులున్నారు. నిన్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరగగా, కోనసీమ కేంద్రంగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కేసీఆర్ బర్త్ డే సంబరాలు జరిగాయి. తెలంగాణ-సీమాంధ్ర ఐక్యవేదిక కన్వీనర్ సంగినీడి సీతారాం ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు కేసీఆర్ బర్త్ డేను పురస్కరించుకుని ఫ్లెక్సీని ఏర్పాటు చేయడమే కాక ఏకంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని అంధుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగినీడి సీతారాం మాట్లాడుతూ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కేసీఆర్ తెలంగాణలో జనరంజక పాలన సాగిస్తున్నారని కీర్తించారు.