: అచ్చుగుద్దిన యాపిల్ ఫోన్ లా 'ఫ్రీడమ్ 251'


భారత మార్కెట్లోకి ఓ పెను సంచలనంలా వచ్చిన 'ఫ్రీడమ్ 251' స్మార్ట్ ఫోన్ టెలికం రంగంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ఫోన్ యాపిల్ ఫోన్లకు నకలులా కనిపిస్తుండటం, యాప్ ఐకాన్లు, ఫోన్ డిజైన్ వంటివన్నీ యాపిల్ ఫోన్ మాదిరే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు ఉదయం ఈ ఫోన్ ను కొనుగోలు చేద్దామని భావించిన వారికి నిరాశ ఎదురైంది. 'ఫ్రీడమ్ 251 డాట్ కామ్' వెబ్ సైట్ ఎంతకీ తెరుచుకోలేదు. ఒకవేళ ఓపెనైన వారికి 'సీఓడీ' (క్యాష్ ఆన్ డెలివరీ) సౌకర్యం లేదని కనిపిస్తోంది. ఈ ఫోన్ కావాలంటే, వెంటనే డబ్బు చెల్లింపు జరపాల్సివుంటుంది. దీనికితోడు మొబైల్ డెలివరీకి నాలుగు నెలల పాటు ఆగాల్సి వుంటుందని కూడా మెసేజ్ కనిపిస్తోంది. పోనీలే కదాని వివరాలు ఎంటర్ చేస్తే, ఆపై మళ్లీ మళ్లీ వెబ్ సైట్ ఆగుతూ, నిలుస్తూ ఔత్సాహికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇదిలావుండగా, ఎంత చౌకరకం పరికరాలు వాడినా, ఇవే స్పెసిఫికేషన్స్ తో ఫోన్ తయారీకి కనీసం రూ. 2 వేలకు పైగా ఖర్చవుతుందని, అటువంటిది ఇలా రూ. 251కి ఈ ఫోన్ విక్రయాలేంటని మొబైల్ పరిశ్రమ మండిపడుతోంది. ఇండియాలో టెలికం రంగంలో అస్థిరత్వం తేవడానికి పన్నిన కుట్ర ఇదని, ఎట్టి పరిస్థితుల్లోను ఈ ధరకు ఫోన్ లభ్యత సాధ్యంకానే కాదని, వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్ముకుని ఫోన్లు తయారు చేసినా లక్షల్లో మాత్రమే ఫోన్లు తయారవుతాయని ఓ ప్రముఖ మొబైల్ ఇండస్ట్రీ ఎండీ వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ జరపాలని టెలికం శాఖను కోరుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఫోన్ కు భారత ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫోన్లో పలు భారత ప్రభుత్వ యాప్ లు ప్రీలోడెడ్ గా కనిపిస్తున్నాయి. ఇక మిగతా స్పెసిఫికేషన్స్ ఏ లోఎండ్ స్మార్ట్ ఫోన్ కూ తీసిపోనట్టు ఉన్నాయి.

  • Loading...

More Telugu News