: భాగ్యనగరికి డిగ్గీ రాజా!... జీహెచ్ఎంసీ, ఖేడ్ ఎన్నికలపై పోస్టుమార్టం
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికలు, మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. గ్రేటర్ లో రికార్డు విజయాన్ని నమోదు చేసిన ఆ పార్టీ సొంత బలంతోనే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఖేడ్ లో తొలిసారి జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ, అప్పటిదాకా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న మరో అసెంబ్లీ సీటును లాగేసుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు పలికి తెలంగాణను రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తమకు ఘోర పరాభవం ఎదురవుతుండటం కాంగ్రెస్ పెద్దలను నిద్ర పోనివ్వడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నేడు హైదరాబాదు రానున్నారు. గ్రేటర్ తో పాటు ఖేడ్ లోనూ పార్టీ ఘోర పరాజయంపై ఆయన పోస్టుమార్టం నిర్వహించి, భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టనున్నారు.