: ‘ఉషా’పతినే!... ఉప రాష్ట్రపతి పదవిపై వెంకయ్య సెటైరికల్ కామెంట్స్


ప్రత్యక్ష ఎన్నికలకు ఎప్పుడో స్వస్తి చెప్పిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు... తాజాగా ప్రత్యక్ష రాజకీయాలకు కూడా స్వస్తి చెప్పనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇక రాష్ట్రపతి పదవిలోకి వెంకయ్య వెళ్లనున్నారన్న ప్రచారమూ సాగుతోంది. ఈ క్రమంలో త్వరలో ఆయన ఉప రాష్ట్రపతిగా ఎంపిక కానున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని, రాజ్యాంగ పదవులపై తనకు ఎంతమాత్రమూ ఆసక్తి లేదని వెంకయ్య కుండబద్దలు కొట్టారు. ఉప రాష్ట్రపతి కంటే ‘ఉషా’పతిగా ఉండటమే తనకిష్టమని నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకయ్య చమత్కరించారు. వెంకయ్య సతీమణి పేరు ఉష అన్న సంగతి తెలిసిందే. ఆమె పేరునే వల్లె వేసిన వెంకయ్య... ఉప రాష్ట్రపతి పదవిపై తనకు అంతగా ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్యను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసి తన కేబినెట్ లో కీలక మంత్రిని వదులుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సిద్ధంగా లేరట. ఈ క్రమంలో ఈ జూన్ ఆఖరు నాటికి వెంకయ్య రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. ఆయనను మరోమారు పెద్దల సభకే పంపించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందన్న వార్తలకు నిన్నటి ఆయన సెటైరికల్ కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి.

  • Loading...

More Telugu News