: అమరావతి నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తొలి భవన నిర్మాణానికి నిన్న శంకుస్థాపన జరిగిపోయింది. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తానికే (నిన్న ఉదయం 8.23 గంటలు) ఈ కార్యక్రమం మంత్రోచ్చారణల మధ్య ముగిసింది. ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపనను పూర్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని రీతిలో నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేశారు. శంకుస్థాపనలో భాగంగా ఇటుక వేసి దానిపై సిమెంట్ వేసిన తర్వాత తన కేబినెట్ సహచరుల సమక్షంలోనే ఆయన నేలపై కూర్చుని అమరావతి నేల తల్లిని ముద్దాడి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘అ’ అంటే అమరావతి అని, ‘ఆ’ అంటే ఆంధ్రప్రదేశ్ అన్న నానుడి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు సాష్టాంగ నమస్కారాన్ని అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించగా, తెలుగు దినపత్రికలు ఆ ఫొటోను ప్రధానంగా ప్రచురించాయి.