: రాహుల్ గాంధీపైనా ‘రాజద్రోహం’?... పిటిషన్ విచారణకు ఓకే చెప్పిన అలహాబాదు కోర్టు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజద్రోహం కేసుల సంఖ్య పెరిగిపోయింది. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన గుజరాత్ యువ సంచలనం హార్దిక్ పటేల్, తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా పాట రాశారన్న కారణంగా ప్రముఖ రచయిత కామ్రెడ్ కోవన్, జేఎన్ యూ ఘటనలో ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ ఎస్ఏఆర్ గిలానీలపై ఇప్పటికే రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో చిక్కుకున్న హార్దిక్ పటేల్ నెలల తరబడి జైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా రాజద్రోహం కేసు నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది. జేఎన్ యూలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారికి మద్దతు పలికిన రాహుల్ గాంధీపై రాజద్రోహం కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్ ను అలహాబాదు కోర్టు నిన్న విచారణకు స్వీకరించింది. ఓ న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్ ను విచారించేందుకు అలహాబాదు అదనపు చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఓకే చెప్పారు.