: కేసీఆర్ ఇచ్చిన పెన్నుతోనే ఆయన పుట్టినరోజు పాట రాశాను: సాహిత్యకారుడు మిట్టపల్లి


సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేటి తరం సాహిత్య కారుడు మిట్టపల్లి సురేందర్ పాట రాశాడు. అది కూడా, కేసీఆర్ గతంలో తనకు ఇచ్చిన పెన్నుతోనే ఈ పాట రాయడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పాట కేసీఆర్ గురించి చెప్పే పాట కాదని.. ఆయన సేవని, స్వప్నాన్ని చెప్పే పాట అని అన్నారు. ‘వర్థిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు..’ అంటూ మొదలయ్యే ఈ పాటలో ‘నీ జన్మ ఒక స్వాతంత్ర్యం.. నీ పలుకులే సందేశం’ అని చెప్తూ కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపానని మిట్టపల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గతంలో తనకు ఇచ్చిన పెన్ను విషయాన్ని కూడా ప్రస్తావించారు. సెప్టెంబర్ 30, 2014న ఒక సమావేశంలో తెలంగాణ ఏర్పాటులో సాహిత్యం పాత్ర గురించి కేసీఆర్ మాట్లాడారు. బంగారు తెలంగాణలో కూడా అదే స్థాయిలో సాహిత్యం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ సమావేశానికి హాజరైన మిట్టపల్లి పెన్నులో ఇంకు అయిపోయింది. ఇది గమనించిన కేసీఆర్ ‘సురేందర్ ఈ పెన్ను తీసుకో..దీంతో మంచి పాట రాయి తమ్ముడూ’ అంటూ ఒక పెన్నుని మిట్టపల్లికి ఇచ్చారు. అయితే, ఆ పెన్నును వెంటనే ఉపయోగించకుండా ఆయన భద్రంగా దాచుకున్నారు. అప్పుడు ఆయన పక్కనే ఉన్న గాయకుడు దేశపతి శ్రీనివాస్ ను అడిగి మరో పెన్ను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాసిన పాటకు ఆయన ఇచ్చిన పెన్నునే ఉపయోగించానని మిట్టపల్లి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News