: గుర్తుంచుకోండి... మాది రూ. 6.5 లక్షల కోట్ల సంస్థ: నరేంద్ర మోదీకి బోయింగ్ చురక!


సమీప భవిష్యత్తులో భారత్ ను రక్షణ రంగ ఉత్పత్తుల అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10 లక్షల కోట్లకు పైగా) వెచ్చించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్న వేళ, తమను విస్మరించరాదని బోయింగ్ సంస్థ చురకలు వేసింది. 2012లో ఫైటర్ జట్లను కొనుగోలు చేయాలని ఇండియా భావించినప్పుడు, ఫ్రాన్స్ కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్ కు కాంట్రాక్టు దక్కిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోటీలో బోయింగ్ సైతం నిలిచింది. దీన్నే ప్రస్తావిస్తూ, "ఏరోస్పేస్ ఎకానమీలో భారత్ దూకుడుగా ఉంది. కేవలం 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 37 వేల కోట్లు) విలువైన దస్సాల్ట్ తో అవుతుందా? లేక 97 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ తో సాధ్యమవుతుందా? ఆలోచించుకోండి" అని బోయింగ్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ కోహ్లర్ సూచించారు. సింగపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న భారత్ ను, వెపన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చాలన్న మోదీ ఆలోచన స్వాగతించదగ్గ విషయమని అన్నారు. యుద్ధ విమానాలు తయారు చేస్తున్న బోయింగ్ తో పాటు, సాబ్ ఏబీ సైతం భారత మార్కెట్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. తాము వాణిజ్య విమానాలతో పాటు యుద్ధ విమానాలు, రక్షణ రంగంలో రవాణా విమానాలు తయారు చేసి అందిస్తున్నామని, సాబ్ ఏబీ తయారు చేయలేని భారీ విమానాలు తాము అందివ్వగలమని అన్నారు. బోయింగ్ వ్యాఖ్యలపై సాబ్ ప్రతినిధి రాబ్ హ్యూసన్ ఆచితూచి స్పందించారు. తమ సంస్థ 'ఇండియాకు స్మార్ట్ భాగస్వామి' అని, దీర్ఘకాల భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఇదే విషయమై స్పందించేందుకు దస్సాల్ట్ ప్రతినిధులు అందుబాటులో లేరు.

  • Loading...

More Telugu News