: వైఎస్ ను వ్యతిరేకించలేదు... చంద్రబాబును పొగడలేదు: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు
టీడీపీ ‘ఆకర్ష్’ వలకు వైసీపీ ఎమ్మెల్యేలు చిక్కిపోయారని, త్వరలోనే పది మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు మాదిరిగానే తాము కూడా విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరెవరు టీడీపీలో చేరనున్నారన్న విషయంపై మాత్రం ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఈ క్రమంలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర వాదన చోటుచేసుకుంది. వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారంటూ టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి (వైసీపీ) ఘాటుగా స్పందించారు. టీడీపీలో చేరాల్సి వస్తే ప్రాణత్యాగం చేసుకుంటానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని వ్యతిరేకించలేదని, అదే సమయంలో చంద్రబాబును పొగడనూ లేదని ఆయన తేల్చిచెప్పారు. రాచమల్లు వ్యాఖ్యలతో జడ్పీ సమావేశంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం చోటుచేసుకుంది.