: తాత్కాలిక సచివాలయం కానే కాదు... శాశ్వతమే: ఏపీ మంత్రులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నేడు శంకుస్థాపన జరిపిన సచివాలయం, ఉద్యోగుల నివాస సముదాయాల గృహాలు తాత్కాలికమని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ మంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. ఇది తాత్కాలిక భవనం కానే కాదని, రాజధానిలో నిర్మిస్తున్న మొదటి భవంతని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ తదితరులు వెల్లడించారు. ఈ భవంతిని ఇప్పుడు కట్టి, తదుపరి కూలదోస్తామని జరుగుతున్న ప్రచారాన్ని వారు తోసిపుచ్చారు. సెక్రటేరియట్ తదితరాలు శాశ్వతంగా ఇక్కడే ఉంటాయని, మొత్తం 8 అంతస్తుల నిర్మాణానికి ప్రణాళికలు వేయగా, తొలిదశగా రెండు అంతస్తుల నిర్మాణాలు చేపట్టనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే అమరావతి నగరంలో రహదారులు, డ్రయినేజ్, విద్యుత్, మంచినీరు తదితరాలను సీఆర్డీయే సమకూర్చనుందని, ఆ పనులు పూర్తయితే, ఒక్కో బిల్డింగ్ నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు మంత్రులు మాణిక్యాలరావు, అచ్చెన్నాయుడు, పీతల సుజాత, పరిటాల సునీత, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.